Sunday, October 23, 2011


ఓ భిన్న దృశ్యం!

మరో తప్పనిసరి త్రిశంకు స్వర్గ ప్రదర్శనకై
అసహనంగా మస్తిష్కపు నగారా
నిద్ర లేస్తున్న దృశ్యం

తెలతెల వారుతున్న ఉదయపు
లేత బూడిద రంగును దులుపుకుంటూ
అనకొండ చర్మపు పొలుసుల్లా
చేదెక్కుతున్న పెదవులతో
యాంత్రిక జీవాలు సాగుతున్న దృశ్యం

కాలనేమి కనికట్టు దుకాణంలో
కాలం కలలా కరిగి
క్షణాలై ప్రవహించే పగటి దృశ్యం

పగలంతా రాట్నం తిప్పిన నగరం
రంగుల వెలుగుల్లో
నాట్యమాడేందుకు ముస్తాబయే
మనోహర సాయంకాల దృశ్యం
దేహం కాసై కరిగేందుకు
జ్వాలాతోరణం
 చుట్టుకుంటున్న దృశ్యం

చిన్ని ముద్దంత ఆప్యాయతకై
ఆశగా యెదురుచూసే
పసిహృదయాలను,
ఆలంబనను కోరే సహచరత్వాన్ని
నిస్సహాయంగా ఛీత్కరించుకుంటూ
సాగిలపడే
ఓ మధ్య తరగతి సాయంత్రపు
అకాల వృద్ధాప్యపు దృశ్యం

కాలుష్యపు మత్తులో జోగి
హద్దులు దాటిన నగరపుటంచుల్లో
తాంత్రిక పాతాళభైరవి సాక్షిగా
మార్జాలగతుల్లో,విలాసనృత్యాల్లో,
పరదేశీ రాగం విశృంఖలత్వాన్ని
స్ఖలిస్తున్న దృశ్యం

సంస్కృతీ వారసులు
జంటనగరాల జుగల్బందీల్లో
నిస్సహాయపుటాక్రందనల ముషాయిరాల్లో,
శిల్పతారకలై, తథాగతుని సాక్షిగా,
చెరువు గట్టున తరిస్తున్న దృశ్యం

నెత్తుటిరుచికై
నిద్రనటిస్తున్న పంజా
రాత్రిదారులకై
కనులు తెరుస్తున్న దృశ్యం

మరో తప్పనిసరి ఉదయానికై
తడిసినకట్టెలా
ఆరి రాజుకునే నగరం
ఓ నిత్య భీభత్స దృశ్యం
                                              -విజయ బాబు,కోగంటి

(Published in Navya, Telugu weekly17th Dec 2008)



పలకరించి చూడు!

పలకరించి చూడు!
ఓ మల్లి,
పరిమళించే పాట గొంతుక విప్పవచ్చు!

ఓ శిల,
జడత్వాన్ని విదిలించుకుని
జీవనాదాన్ని వినిపించవచ్చు!

ఓ చిన్నిగువ్వ,
ఖండాంతరాలను చుట్టివస్తూ
సాహసగాధలు పాడవచ్చు!

ఓ తార,
చీకటి కప్పి వేస్తున్నా,
నిర్భయంగా వెలిగే రహస్యాన్ని చెప్పవచ్చు!

ఓ హృదయం,
మోస్తున్న వ్యధను కరిగించుకు,
అశృ బిందువై తేలికపడి నవ్వవచ్చు!

మనసులను
చల్లగాలిలా స్పృశించేది కదా
ఓ మంచి మాట!

ఓ ఆత్మీయ మైన మాట కన్నా
మన దాహం తీర్చగల తీయని సంద్రాలెక్కడున్నాయి నేస్తం?
అందుకె స్వచ్ఛమైన వాన చినుకులా,
పలకరించి చూడు!
                                                                Vijaya Babu,Koganti


( Published in Navya, Telugu weekly22nd October 2008)

Wednesday, October 5, 2011

ఇలా, యెలా?


ఇలా, యెలా?
మలయ మారుతపు పిలుపు
పట్టించుకో లేదు.
దూసుకొచ్చిన సుడిగాలిలో
తేలిపోనూ లేదు.
కొమ్మనే పట్టుకు
శిశిరం దాకా వేలాడి
ఒంటరి చెదలా రాలి పోవడం - ఇలా?

క్షణికమైనా , యెగసి పడి,
తుళ్ళి,తేలి,
గిరికీల పరవశత్వాన్ని మోసి
ఎవరి కంటా పడని
అడవి పువ్వైనా సరే,
పరిమళించడం అనుభవం!
అనుక్షణం క్షణ క్షణమై పరవశించడం వరం!!

మనసును వెలివేసిన బానిసలమై
శూన్యాడంబరాన్ని చుట్టుకుని,
నిత్య ఉదయాస్తమయాల మధ్య
వికసించక, వివసించక
జీవన్మరణాలమై,
ఇలా,యెలా?

జ్వలించని జీవితం మెరుపౌతుందా?
ఎగసి పడని ఉద్వేగం అల అవుతుందా?
అనుభూతి లేని అనుభవం జీవితమవుతుందా?
ఇన్నీ తెలిసి ఇలా జడంలా!,యెలా??
                                                       -విజయ బాబు,కోగంటి
(Published in Navya, Weekly on 13th August 2008)

      


Saturday, October 1, 2011

ఓహ్ సమ్మర్!


ఓహ్ సమ్మర్!

"సంవత్సరానికోమారేగా నేను!" -
వాడిగా,వేడిగా యెండ.

యెండిన చెట్లతో,
దిక్కులేక వీధుల్లో
వెర్రిగా కేకలేస్తూ
పరిగెడుతున్న వడగాలి!

యెర్ర సూర్యుడి కౌగిట్లో
ఉడుకెత్తిన నేల
ఓ విరిసిన దిరిసెన పువ్వు!

అందరినెత్తినా టోపీలు పెడుతూ
నవ్వుతున్నాడు
వికట సూర్యుడు.

"ఇన్నాళ్ళకు మళ్ళీ గుర్తొస్తాం"-
ఎయిర్ కూలర్ల గుర గుర!

చెరువుల్లో, బావుల్లో,
"కుండ" కోనల్లో
చల్లగా దాహపు ఈదులాట!

"పిందెలతో వచ్చిన గ్రీష్మం
పండిందాకా తోడుండి పోయింది" -
ఓ మామిడిచెట్టు సంబరం!

పరీక్షలూ, క్రికెట్ మ్యాచ్ లూ,
"గుళ్ళూ", గోపురాలూ,
పిల్లల కేరింతలూ,పెద్దల విసుర్లూ,
చలివేంద్రాలూ, కరంట్ కట్లూ,
చెరుకు రసాలూ, మల్లెలూ, మామిళ్ళూ,
ఓహ్, సమ్మర్!

-విజయ బాబు,కోగంటి
                            (Published in Saakshi, Funday,, Daily on 1st June 2008)

ఇలాగే బతుకుదాం!


ఇలాగే బతుకుదాం!

ముసుగు మీద ముసుగు తొడిగి
ముఖం దళసరైంది
అసహనపు ఉక్కపోతతో
గాలి ఆడని పరిస్థితి.

ఘడియకో వేషం
గంటకో మోసం
నటన మన జవం,జీవం,వేదం,అవసరం
చివికి వాసనేస్తున్నా
అది మన కవచం!

అవే సెగలు, అవే వగలు, అవే మారని చేతలు
ఆడైనా, మగైనా,
మనం వూసర వెల్లులం
కరుచుకుందాం –  అవసరాలు తీరేదాకా,
                      రంగులు వెలిసేదాకా,
                      భ్రమలు తొలిగేదాకా!
 మత్తు దుప్పట్లో మనసును జోకొడదాం
ప్రపంచాన్ని గుప్పిట్లొ దాచేద్దాం
మాటల్లో గారడీలు చేద్దాం;
గభీరపు మేకపోతులమై
పగలుగానవ్వి, రాత్రులమై దుఃఖిద్దాం
నటన మన నాదం కదా!

కాని
మనమేనా ఇలా బతికేదనిపిస్తోంది కదూ!
బాల్యపు గతాన వూగి,
పువ్వై పరిమళించి యెన్నో యుగాలైనట్లుంది కదూ!
లేత అమాయికపు బాల్యస్మృతి
యెన్నడో యింకిపోయినట్లుంది కదూ!

యెక్కడో తెలిసే తప్పిన దారి
వెదికితే దొరక్కపోదు
ఐనా, ఒకప్పటి మనలా బతికే ధైర్యమూ లేదు!
చాలా ముందుకొచ్చేశాం గదా!

అందుకే ఇలానే వుందాం!
నవ్వుతున్నట్లు యేడుద్దాం!
పొగడినట్లు తెగుడుదాం!
బ్రతికిస్తున్నట్లు బతుకుదాం!

నటన మన ముఖ కవచం,
జీవితపు అవసరం,
బతక్క తప్పదు కదా!
ఇలానే బతుకుదాం!               
                                                          -విజయ బాబు,కోగంటి
(Published in Kavitha Prabha, Andhra Prabha, Daily on 16th May 2004)