Friday, September 23, 2011
నేనూ-వానా - poem
నేనూ-వానా
ఇంటి ముందంతా
నేల ’సర్వే’ చేసే
తూనీగ హెలికాప్టర్లు.
వానరాకడను
సందుగొందుల్లో
’కాన్వాస్’ చేస్తున్నాడు గాలివెధవ!
నేలకొంగిన మబ్బుల్ని చూసి
కొమ్మల్లో ఆకుల నిండా
ఒకటే ’గాసిప్స్’!
తుంపరగా మొదలైన వానకు
భూమికన్నె వళ్ళంతా
పులకింతల పరిమళం!
చెట్టూ,పుట్టా,యావజ్జగత్తునూ
నీటి పరదాలతో
కప్పేసిన వాన
నన్నొకణ్నే కిటికీ ఇవతల
వెలివేసింది.
’ఈసారీ గొడుగుల్లేవు’,
తలలు విదిలిస్తున్నై
తడిసిన పక్షుల ’కంప్లయింట్లు’.
వానకౌగిట కరిగిన
భూమిని చూసి
ఈర్ష్యతో పోతోంది
ఓ నీరుగారిన మబ్బు.
హద్దుల్లేని ఆనందంతో
ఉరికి పడుతున్నై
పిల్లల కేరింతలు మోసే
చిన్ని చిన్ని పడవల వాన సంద్రాలు!
నా బాల్యపు గతంలా కురిసి
కవ్వించి, కరిగి
పోయిన
వానను చూస్తుంటే
శిశిరపు మోడైన నా గుండెకు
ఓ అసూయ, ఓ ఆశ!
-విజయ బాబు,కోగంటి
(Published in
Kavitha Prabha, Andhra Prabha, Daily on 7th September 2003)
Subscribe to:
Comments (Atom)