Thursday, October 8, 2015

ఓ మాటడగనా?
అలా, నింగి నేలను తాకిందాకా
నడుస్తూ వెళ్ళి వద్దాం వస్తావా?
ఒకోసారి గుండె అరల్లో దాచుకున్న
నవ్వుల తేనె పట్టునో
కన్నీటి తెరలనో
అందరిముందూ విప్పలేం కదా?
అందుకే అలా పంచుకుంటూ
కాలంతో పాటు కరుగుతూ
వెళ్ళి వద్దాం, వస్తావా?
నడక శరీరానికి మంచిదే,
కానీ నీతో నడక
మనసుకూ మంచిదనిపిస్తోంది.
ప్రతి అడుగులోనూ
ఒక్కో ఙ్ఞాపకాన్నీ
వెనక్కు తోసేస్తూ
గుండెను తేలిక పరుస్తూ
నడుద్దాం, వస్తావా!
చాలా ఉక్కగా ఉన్న
ఈ మనసు గోడల బయటికి,
సాయంత్రపు గాలిలో
సంతోషపు చివురు తొడిగిందాకా,
అలా నడుస్తూ,అక్కడ
నింగిని నేల కలిసే భ్రమను చీల్చిందాకా
నడుద్దాం, వస్తావా!?
- డా. కోగంటి విజయబాబు

No comments:

Post a Comment